వేదగరిమ నిరవధికము, అనిర్వచనీయము
వేదాలు నాలుగు, వేదాంగాలు ఆరు, ఉపాంగాలు నాలుగు. ఈ పదునాలుగున్నూ ధర్మస్థానాలని చెప్పబడతవి.
వేదగరిమ నిరవధికము; అనిర్వచనీయమున్నూ, లౌకికంగా ఒకవస్తువు ప్రశస్తిని మరొక గొప్పవస్తువుతో పోల్చిచెప్పుతాం. ఉదాహరణకు క్షేత్రాలమాట-మనదేశంలో కాశీక్షేత్రానికున్న ఏకైక గౌరవం మరొకక్షేత్రాని కుండదు. అందుచేత ఇతరక్షేత్రాలను కాశితోపోల్చి కాశిక్షేత్రంతో సమానమైనవని చెప్పుతుంటారు. కాళహస్తిని దక్షిణకాశి అని అంటారు. హిమాచలంలో ఉత్తరకాశి ఉన్నది. వృద్ధాచలక్షేత్రాన్ని వృద్ధకాశి అని అంటారు. చిత్తూరుజిల్లాలోని బుగ్గ అనే క్షేత్రాన్నికూడా కాశి అనే వ్యవహరిస్తున్నారు. దక్షిణాన తెన్ కాశి అని ఒకటున్నది. తెన్ శబ్దమునకు ద్రావిడమున దక్షిణమని అర్థమున్నది. మరికొన్ని క్షేత్రాలను కాశీకంటె గొప్పగా చెబుతారు. ఈక్రింది శ్లోకం కుంభకోణ క్షేత్ర విశిష్టతను తెల్పుతూంది.
అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి,
పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి||
వారాణస్యాం కృతం పాపం కుంభకోణ వినశ్యతి,
కుంభకోణ కృతం పాపం కుంభకోణ వినశ్యతి||
కాశీకంటే కుంభకోణమే గొప్ప అని ఈశ్లోకభావం. ఇట్లు కాశీని ఉపమానంగా గ్రహించి దాని కొక విశేషోత్కృష్టత చేకూరుస్తున్నారు. కాశీని గూర్చిన దీ క్రింది శ్లోకం.
క్షేత్రాణాముత్తమానా మపి యదుపమయాకాలిలోకేప్రశస్తిః
చిత్తద్రవ్యేణముక్తియమభిలషతాం యాద్భుతాపణ్యవీథీ,
సాక్షాద్విశ్వేశ్వరస్య త్రిభువనమహితాయా పురా రాజధానీ
రమ్యా కాశీ సకాశీ భవతు హితకరీ భుక్తియే ముక్తయే నః||
భక్తి అనే ద్రవ్యం ఉంటే ముక్తిని సులభంగా కొనగలిగిన పణ్యవీథి కాశి ఉత్తమక్షేత్రాల కిది ఉపమానం, ఇట్లా వేదాలను సైతం ఉపమాన వస్తువుగా పరిగణించి తక్కిన గ్రంథాల ప్రశస్తిని నిరూపిస్తుంటారు. భారతదేశంలో రామాయణాని కున్న ప్రాముఖ్యం మరొకదాని కుండదు. ఈ కథ ప్రాంతీయ భాషలన్నిటికీ పరిచితమే. ద్రావిడమున'కంబరు'వృత్తరూపంలోనూ, 'అరుణాచలరాయరు' అనేవారు నాటకరూపంలోనూ రామాయణకథను అనువదించారు. సంస్కృతమునందే కాళిదాసు రఘువంశకావ్యం, భోజరాజు రామాయణచంపువు వ్రాశారు. భవభూతి ఉత్తరరామచరిత్రకున్నూ, రామభద్ర దీక్షితులు జానకీపరిణయమునకున్నూ కర్తలు. అవి అటుంచి రామాయణమునందే ఆనందరామాయణం, అద్భుతరామాయణం, తత్త్వసంగ్రహ రామాయణం అని అనేకం ఉన్నవి. 'ఎక్కడ చూచినా రామాయణమే' అని ఎవరో ఒకరనగా, 'ఔను, ఎవరింట్లో చేసుకొన్నా పాయసానికి చక్కెరే కదా వాడాలి' అని మరొకరు బదులుచెప్పారట 'వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షా ద్రామాయణాత్మనా' ఇక భారతం విషయం ఎత్తుకొంటే, అది పంచమవేదమని గణనకెక్కింది.
తిరువళ్ళువర్ వ్రాసిన తిరుకురల్ కు తమిళ##వేదమని ప్రశస్తి, తేవారము, తిరువాచికములనుకూడా తమిళ్ వేదములనియే వాకొంటారు. క్రైస్తవగ్రంథాలలో ఒకదానికి సత్యవేదం అని పేరు. ఇట్లా పరిశీలిస్తే వేదాలకొక విశిష్టిత ఉన్నదని మనం గ్రహించగలం.
ద్వాపరయుగాంతాన, కలి ప్రారంభాన దాదాపు ఐదువేల ఏండ్లక్రితం వ్యాసభగవానులు వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు. ఉత్తర మీమాంస, అష్టాదశపురాణాలు, భారతమూ వ్రాసింది వ్యాసమహరియే. వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేయడం కానిపని, ఎంతమాత్రం ఒకడు అధ్యయనం చేయగల్గి శ్రేయస్సు పొందగలడో. అంతమాత్రం భాగాలుగా వేదాలు విభజింపబడినవి. అవియే శాఖలు తమ శిష్యులైన సుమంత, పైల, జైమిని, వైశంపాయనులకు, వ్యాస మహరి నాలుగు వేదాలను విభజించి అనుగ్రహించారు. పురాణాలు సూతున కుపదేశించారు.
ఋగ్వేదానికి అనేకశాఖలు. కాని నేటికి మిగినినది ఒక్క ఐతరేయశాఖ. యజుర్వేదానికి 101 శాఖలు. వానిలో మిగిలినవి మూడు. అవి కాణ్వ, మాధ్యందిన, తైత్తిరీయ శాఖలు, సామవేదానికివేయిశాఖలు. అందు నిలిచినవికౌథుమ, తలవకారశాఖలు, అథర్వణవేదం సంపూర్ణంగా లుప్తమై పోయినట్లే, ఉత్కలబ్రాహ్మణులలో అథర్వణికులనువా రొక తెగ. అధర్వణశాఖనువారు అధ్యనంచేసిఉండాలి. వేదాలు బహువిస్తృతాలై ఉండినందున వ్యాసులు వానిని 1180 శాఖలుగా విభజించి కలియుగానికి ఇవి చాలునని సంక్షిప్తంచేశారట. వీనిలోప్రస్తుతం మిగిలినవిఎనిమిది. అవిన్నీ క్రమేణ అంతరించిపోతున్నై'.
జన్మమాది మరణపర్యంతమూ చేయవలసిన కర్మలను గూర్చి తెలిపేదిశాఖ. 'ఏకం శాఖా మధీత్య శ్రోత్రియోభవతి'.
ఆ కాలంలో ఒకశాఖ పూర్తిగా అధ్యయనం చేసిన వారికి రాజులు శ్రోత్రియగ్రామాన్ని ఇచ్చేవారు. దీనికి పన్నులేదు, వేదాధ్యయనం చేసేవారికి ఉద్యోగాలులేవు. కనుక పన్నుకట్టలేరని గ్రహించి ఉంటారు. ఏప్రవృత్తీలేక ఆత్మలాభార్థమైనపనుల చేస్తూవచ్చిన పరంపర ఒక్కమన దేశంలోనే చూడగలం. ప్రపంచంలో ఒక విశిష్టస్థానం మనదేశం అందుకొన్న దన్నందుకు మన వైదికమే కారణం. విదేశాలలో వివేకానందాదుల పర్యటనచేసి ప్రచార ప్రబోధాలద్వారా మన సంస్కృతి గణనీయమైనదని చాటిచెప్పారు. అద్వైత సిద్ధాంతం క్షుణ్ణంగా ఆకళించుకొన్న జర్మను దేశస్థుడు పాల్ డ్యూసన్, దైవమంటే ఆదిశంకరులే అనిన్నీ, వారికి మించి వేరేదైవం లేదనిన్నీ వ్రాసి, తన ప్రతిరూపం మనదేశానికి పంపి, దానిని కాలడియందుంచమని కోరి ఆచార్యులవారియెడ తన విశేషాదరాన్నీ, గౌరవాన్నీ ప్రకటించుకొన్నాడు.
ప్రతి వేదశాఖకూ మంత్రము బ్రాహ్మణము, ఉపనిషత్తు అని మూడు విభాగాలున్నవి. మంత్రములు పుణ్యకారకములు. మంత్రదేవత నుద్దేశించి మంత్రప్రోక్తంగా అగ్నిలో ద్రవ్యం ఆహుతి ఇయ్యాలి. ఆహుతుల నిచ్చేటప్పుడు 'నాది కాదు, నీది' అను భావంతో 'నమమ' అని చెప్తారు. సమస్తమునూ ఈశ్వరార్పణం చేయాలి అని అనడాని కిది సూచన, దేని నుద్దేశించి కర్మ లెట్లాచేయాలో చెప్పేవి బ్రాహ్మణాలు, మంత్ర, బ్రాహ్మణాలు కర్మకాండకు చేరినవి. శాఖాంతంలో ఉన్న ఉపనిషత్తులు జ్ఞానకాండకు చేరినవి.
బ్రాహ్మణాలప్రకారం మనము కర్మలు చేయాలి, కర్మాచరణ ఫలం ఈశ్వరార్పితం చేస్తే ఆయన ప్రసాదంచే సత్యం దర్శించగలం.
జన్మాద్యశ్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనేబ్రహ్మహృదాయఆదికవయే ముహ్యంతి యత్సూరయః,
తేజోవారిమృదాం యథావినిమయో యత్ర త్రిసర్గోమృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి||
- భాగవతము.
మనం సత్యానికి వెలియైఉన్నాము. కాని అట్లుండుటకు వీలుకాదు. ఈశ్వరార్పణబుద్ధితో కర్మలుచేసి పరమాత్మతో ఐక్యంకాదగిన దారి చూపేవే ఉపనిషత్తులు.
మనకులబ్ధమైన ఒక్కొక్క శాఖకున్నూ తత్సంబధమైన ఒక్కొక్క ఉపనిషత్తున్నది. కాణ్వశాఖకు ఈశావాస్య, బృహదారణ్యకాలే ఉన్నవి. మనకు తెలియని శాఖలకు సంబంధించిన ఉపనిషత్తులున్నూ కొన్నిదొరికినవి. అథర్వణవేదానికి చేరిన కఠం లబ్ధమైనది.
తెలియనివానిని తెలుపుటకు లోకంలో ఎన్నోవస్తువులున్నవి. కొన్నిటిని విని మనం జ్ఞానం సంపాదిస్తాం. కొన్నిటిని ఊహామూలకంగా గ్రహిస్తాం. వార్తాపత్రికలు, తంతులు, తపాలు అనుక్షణమూ ఎన్నోవిషయాలను మనకు అందజేస్తున్నవి. కాని మనకు లోకాతీతవిషయాలు తెలపడానికి ఒక వార్తాపత్రిక అవసరమైఉన్నది. ఇంద్రియరూపంగా గ్రహించే జ్ఞానాన్ని కాక అతీంద్రియాజ్ఞానాన్ని తెలిపే సాధనమొకటిమనకు కావాలి. అదే వేదం.
మనం లోకంలో ఏన్నో చూస్తున్నాం. ఇవి ఏకమా? అనేకమా? భౌతికశాస్త్రజ్ఞులు ఇవన్నీ వేర్వేరువస్తువులనియే అభిప్రాయపడ్డారు. అటుపై ఇన్నివస్తువులున్నా వీనికి మూలమైనవి డెబ్బదిరెండు మూలపదార్థాలనిన్నీ (ఎలిమెంట్స్) వాని సంయోగ వియోగ కారణంగా సమస్త వ్యస్త వస్తుజాతమూ ఏర్పడుతున్నదనీ చెప్పారు. ఈవిచారణ ఇంతటితో ఆగక ఇంకా ముందుకు సాగితే అన్నిటికీమూలం ఒక్కటి అన్నజ్ఞానం ఉదయించవచ్చు. ఆత్మతత్త్వజ్ఞులు - సర్వమూ చైతన్య భూతమూ, చైతన్యమయమూ అని చెప్పుతారు. అన్నీఒక్కటే అనేది ద్వైతం.
ఈ రెంటిలో ఏది వాస్తవం? ద్వైతమే సత్యం ఐతే వేదం చూడవలసినపనిలేదు. కంటికి కనిపించేది ద్వైతం. అగోచర విషయాన్నే వేదంచెప్పాలి. బుద్ధికి అతీతమైన విషయాన్ని చెప్పినప్పుడే వేదం మనకు కావలసివస్తుంది. తెలియనిది అద్వైతం. చెప్పితే వేదం అద్వైతాన్నే చెప్పాలి. ద్వైతమే నిజమైతే వేదంచెప్పవలసిన అవసరంలేదు. కర్మకాండ మొదట ద్వైతమనిపించి చివర అద్వైతంలోకి దారితీస్తుంది. 'మీరు వేదాలనమ్మం'డని అంటారు. 'దానికి వలసిన యుక్తి తెలపండి' అని కొందరు అడుగుతారు. యుక్తికి బద్ధమైతే అది వేదామెట్లా అవుతుంది? యుక్త్యతీతమైనదే వేదం. దివ్యదృష్టిగల మునులు తెలిసినదే వేదం. ఏది అతీంద్రయమో అవ్యక్తమో, వాజ్మనములకు అతీతమో అదే వేదం.
వేదాలగూర్చి ఇంత తెలిసికొన్న మనకర్తవ్యమేమి? బ్రాహ్మణులు పంచమహాయజ్ఞములలో ఒక్కటైన బ్రహ్మయజ్ఞం చేయాలి. బ్రహ్మ అంటే వేదం. మంత్రశక్తి అఖండ దీపంవలె వెలుగుతూ ఉండడానికి బ్రహ్మయజ్ఞం తప్పనిసరి. ఎవరు ఏశాఖకు చెందినవారో వారు ఆ శాఖకుచెందిన మహరులకు తర్పణాదులను ఇయ్యాలి. రెండు అక్షరాలైనా వేదాధ్యయనం చేయాలి. వీలు లేకుంటే వేదసారమైన గాయత్రీజపం వేయిమారులైనా చేసుకొంటూ ఉండాలి. అదీ వీలుకాకపోతే పదిమార్లైనా జపించాలి. అది చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. ఆదివారం ఎల్లాగూ సెలవు కనుక, సూర్యునకు ఆదివారం ప్రీతి గనుక వేకువ నాలుగుగంటలకే లేచి వేయిమారులు గాయత్రీ జపం చేస్తే క్షేమం కలుగుతుందని నాఅభిప్రాయం.
|